Shiva tandava stotram Telugu



జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ||

జడల అడవి నుండి జారు నీటి  ఏరు సుద్ది జేయ

మెడను పొడవు దండ లాగు నూగి తూగు నాగు తోడ
  
డండండమ డండండమ  డమరు సద్దు కడల నిండ  

బెదురు బెట్టు చిందు వేయు శివుడు సిరుల నిడును గాత    (1)
------------------------------------------------------------
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ||

జడల సుడుల మడుగు లోన సుడులు తిరుగ సురల యేరు

పొంగి  పొరలు తరగ లల్లు తీగలతో  వెలుగు తలయు

ధగ ధగ ధగ ధగ ధగ ధగ వెలుగు నుదుటి మంట తోటి

తలపై నెలవంక తోటి  నన్ను నెపుడు లాగు చుండు  (2)
 --------------------------------------------------------------
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ||

కొండల దొర కన్న బిడ్డ కులుకుల చెలి మిగుల వెలుగ  

నలుగడలను పలుతెరగుల తన నలుసులె గనుచు మురిసి  

కడగన్నుల కానుపులతొ    కడగండ్లకు నడ్డుపడుచు

ఎద గమత్తు కంచు కడలె  బట్ట జేసి కట్టు వాడు  (3)
--------------------------------------------------------------
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ||

ఎరుపెక్కిన పాముజడలు విసరు నాగమణుల వెలుగు 

కడల కన్నె మొగము నిండ కావి నీటి పూత పూయ

కొవ్వెక్కిన ఏనుగు వలె  కప్పు కంబళెగిరి యూగ

ఇది యెదలో నబ్బురమే జీవుల గాచుటను గాంచ  (4)  
 --------------------------------------------------------------
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || ||


వేగన్నుల వేలుపు మొద లందరు వేలుపుల తలల

పూల పొడుల పెల్లు జల్లు చల్లిన పాదాల పీట

నాగరాజు చుట్టు  కొనుచు  కట్టిన యా జడల కట్ట

చకోరి చెలి తలను పెట్టి చల్లు చుండు గాక సిరులు  (5)
--------------------------------------------------------------
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || ||


నుదుటి చదర మందు మంట నిప్పు రవ్వ లెగయ వెలిగి

ఐదమ్ముల వాని మింగు నదిరి వేల్పు దొరయె వంగు

చలి తీయని పొడుపు వాడు తలపై వెలిగేటి వాడు

పుర్రెల పెద సామి తలను జడలు మాకు సిరుల నిడుత  (6)
 --------------------------------------------------------------
కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-
ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || ||

బెదర గొట్టు నుదుటి పట్టి  వెలుగుచు ధగ ధగ ధగ ధగ 

నదర గొట్టు ఐదమ్ముల వాని బలిగ  మింగి వేయ  

కొండలదొర కన్న బిడ్డ చను మొనలను ముగ్గు లెన్నొ 

గీయ చేయి తిరుగు వాని  మూడు కనుల వాని తలతు  (7)   
 --------------------------------------------------------------
నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || ||

క్రొక్కారు మొగిళ్ల సరము నడ్ద రాని దాని నడ్డు

 గుడ్డి అమావాస్య నలుపు గట్టిగ నెక్కిన మెడతో

సురల యేరు తలగల వా డేన్గు తోలు గట్టు వాడు

కళలకు పెనుగని  జగముల మోసెడిదొర  సిరుల నిడుత (8)   
--------------------------------------------------------------  
ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-
విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ||

విచ్చు నల్ల తమ్మి వోలె విచ్చు నల్ల వెలుగు గలుగు

అరటి పువ్వు వంటి రంగు కట్టి నట్టి మెడ వానిని

మరుని దుంచి పురము చించి  పుట్టు తెంచి జన్నమార్పి

ఏన్గును అంధకుని దుంచి యముని తెంచు వాని కొలతు  (9)
--------------------------------------------------------------
అఖర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

ఎడతెగని సిరులను గలిగిన గుత్తుల గుత్తుల కళలను

రసపు టేర్ల తీయములను విసరు తీపి పట్టు బట్టి

మరుని అడచి  పురము నడచి  పుట్టు నడచి  జన్నమడచి

ఏన్గును అంధకుని అడచి జముని అడచు వాని కొలతు  (10)  
--------------------------------------------------------------
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || ౧౧ ||

గెలిచినటుల ఎగిరి తిరిగి మరలి తిరిగి  పాము బుసల

తోడ వెడలి వరుసలనిడి బెదర గొట్టు నుదుటి అగ్గి

ధింధింధిమి ధింధిమనుచు డోలు పైన రెచ్చి మోగు


సిరినిడు సడి వెంట నంటి బిట్టు చిందువేయు  శివుడు (11)     
--------------------------------------------------------------
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-ప్ప్
-
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨ ||

పాన్పు ఎట్టిదైన దండ ముత్యపుదో పాములదో

మెరుపు రాయొ బంక మన్నొ  తన వాడో పెఱ వాడో

గడ్డి కన్నొ తమ్మి కన్నొ ఊరి మందొ రారాజో

అంతయు నా కొక్కటనుచు  శివుని  కొలుచు టెప్పటికో  (12)
--------------------------------------------------------------
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ ||

సురల ఏటి పక్క చెట్ల తోపు లోని తొర్ర నుండి  

చెడు తలపుల విడుదలంది  ఏటికోళ్ల నిడుటెపుడో

కనులాటల విడుదలంది నుదుట బూది గురుతు బెట్టి

శివా శివా అనుచునుండి ఎపుడు హాయి నుండెదనో  (13)
--------------------------------------------------------------
ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ ||
నిటుల జెప్పి నట్టి  చాల మంచి మెచ్చు పాట నెపుడు
చదివి తలచి పలుకు వాడు నెపుడు సుద్ది నందుచుండు
శివుని మీద గురువు మీద వడిఁగను బగుతిని శరణును
శంకరు దలచుట ఎప్పుడు జీవుని బ్రాతిని దీయును (14)
--------------------------------------------------------------
పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || ౧౫ ||
కొలుపులు ముగిసెడి వేళల
 పలుకగ పదితలలవాని పాటను సందెన్
నిలకడ తేజీ తేరులు
కలుగును ఏన్గులనుగూడి కలిమి శివాజ్ఞన్ (15)
                          ---&&&--- 




Comments

  1. Namasthe! I have some questions about Dandakamu.

    1. What is the structure (chandasu, length > 26) for a dandakam? Do the paadaalu have to follow the same pattern (like utpalamala, for example)? What patterns are available?
    2. What is the structure of Anjaneya Dandakamu? Who wrote it and when?

    For example, if someone wanted to write a new dandakamu in the same rhythmic style of Anjaneya Dandakamu, should they just follow exactly the same pattern of sounds?

    thank you, Viswanath

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దక్షిణామూర్తి స్తోత్రము - తెలుగు అనువాదము

Dakshinamurty stotram English verse translation