దక్షిణామూర్తి స్తోత్రము - తెలుగు అనువాదము

తెలుగు అనువాదము - Dr. పాతూరి నాగరాజు 
దక్షిణామూర్తి స్తోత్రం - గురు తత్వం


అనువాదంమూలం
1.వేరుగ నెంచకీ సకల విశ్వము నద్దములోని బొమ్మగా
నారయు నెవ్వడెందు తన యెందున నుండగ మేల్కొనంగనే
తోరపు ఈ జగంబెవడు తోచెను మాయననంగ నెంచు నా
తీరగు దక్షిణాస్యశివు దేవుని నొజ్జను నేను గొల్చెదన్
1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
2.అంకురమందుఁ గన్పడని యాకులుఁ గొమ్మలు చెట్టులో గనన్
పొంకము తోడ నిండువిధి పొంగును దేశము కాలమాదిగా
నంకురమంత నుండి జగమంతయు మాయొ! యోగమో!
శంకరు దక్షిణాస్యశివు సామిని నొజ్జను నేను గొల్చెదన్
2.బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
3.ఉన్నది లేక యుండుటగ నుండున దెయ్యది యద్దిదోచు త-
న్నెన్నగ; వేదవాక్యముల నీవె యదంచు నెరుంగ దెల్పు దం
దిన్నగ చేరువారలకు; తెల్యగ తానిక పుట్టు లేదు ఆ
యన్నను దక్షిణాస్యశివు-నయ్యను నొజ్జను నేను గొల్చెదన్
3.యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
4.కన్నములున్న కుండఁగల కాంతులు చిమ్మెడి దివ్వె రీతిగా
కన్నులు నట్టి యంగములు కాంతులఁ దెల్వినిఁ గ్రక్కుచుండ నే
నిన్ని యెఱుంగుదంట జగమెవ్వని వెల్గుల వెంట వెల్గు నా
యన్నను దక్షిణాస్య శివు నయ్యను నొజ్జను నేను గొల్చెదన్
4.నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
5.దేహము నింద్రియమ్ములునుఁ దెల్వియుఁ బ్రాణము శూన్యమున్ మహా
మోహము క్రమ్మ నెంచెదరు మొద్దులు గ్రుడ్డిగ నేనటంచు నా
మోహము ద్రుంచి తీవ్రమగు మూర్ఖపు వాదన ద్రెంచు ఛిన్న స
మ్మోహుని దక్షిణాస్య శివ మూర్తిని నొజ్జను నేను గొల్చెదన్
5.దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
6.రాజిలు సూర్య చంద్రులును రాహువు మ్రింగిన వెల్గు దాచరే ?
తేజము మాయ గప్పుటను తెల్విని నిద్రను ముడ్చివైచి ని
స్తేజుని బోలి నిద్రయని తెల్సి తనుం ద నెరుంగు మేల్కొనన్
తేజపు దక్షిణాస్య శివు దేవుని నొజ్జను నేను గొల్చెదన్
6.రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో‌భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
7.నేనని నేను నేననుచు నిద్రను మెల్కువ బాల్యమాదిగా
తానెపు డెల్లవేళలను తన్నుకు వచ్చుచు తన్ను కొల్వగా
తానొక మేలి సైగ నిడి తన్ను తనే కనిపింప జేయు స
న్మౌనిని దక్షిణాస్య శివు భవ్యుని నొజ్జను నేను గొల్చెదన్
7.బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
8.లోక మ దొక్కటయ్యు బహు రూప విభేదములంది బంధముల్
చేకొని తండ్రి బిడ్డలుగ శిష్యుడు నొజ్జయు కార్య కారణాల్
గా కనిపించు వాడు కలగన్నను మేల్కొని యున్న మాయచే
శ్రీకరు దక్షిణాస్య శివు చిన్మయు నొజ్జను నేను గొల్చెదన్
8.విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
9.నేలయు నింగియున్ కడలి నిప్పును గాలియు సూర్య చంద్రులున్
మూలపు జీవుడంచనగ మొత్తము నెన్మిది యేరి రూపుగా
తేలును వాని మించి మరి తేలదు కట్ట కడున్న సర్వ సం
చాలకు దక్షిణాస్య శివు స్వామిని నొజ్జను నేను గొల్చెదన్
9.భూరంభాంస్యనలో‌నిలో‌ంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
10.అన్నియు తానె యౌట యను నర్థము తేలెడి యీ నమస్కృతుల్
విన్నను నర్థ మెన్న మదిఁ బెట్టినఁ బాడిన నన్ని తానెయౌ
మిన్నగు సిద్ధి తానుగ లభించును యీశ్వరు డౌట వెంటనే
యెన్నగ రాని యీశ్వరత దెన్మిదిగా నయి చేరవచ్చులే
10.సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్
*** ప్రార్థన శ్లోకాలు ***

మఱ్ఱి చెట్టు క్రింద మట్టిలో కూర్చుండి
మునుల కెల్లరికిని బోధ సేసి
పుట్టు చావు ద్రెంచు ముల్లోకముల యొజ్జ
దక్షిణంపు మూర్తి దండమయ్య
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతార మారాత్
త్రిభువనగురు మీశం దక్షిణామూర్తిదేవం
జననమరణఖేద చ్ఛేద దక్షం నమామి
మాటల లేమి పాఠముగ బ్రహ్మము దెల్పెడి కుర్రవానినిన్
నాటిన బ్రహ్మతత్వముతొ జ్ఞానిఋషుల్ పదమంటి చేరగా
మూటవ సంతసమ్మెఱుక ముద్రను చేతను బట్టు యొజ్జనున్
ఆటగ లోననే మురియు మోమును మ్రొక్కెద దక్షిణాస్యునిన్
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం యువానం
వర్షిష్ఠాన్తే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠైః  
ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్ర మానన్దమూర్తిం

స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే
వింత! మర్రి చెట్టు వ్రేళ్ళకడను జూడ!
ముద్దు కుర్ర యొజ్జ ముదుసలులకు!
మాట లేమి యొజ్జ పాఠమ్ము తీరంట!
మరల, శంకలన్ని మాయమంట
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురు ర్యువా
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః

అన్నిజగము లకును నాచార్యుడవు స్వామి!
భవపు రోగమునకు వైద్య మూర్తి !
అన్ని విద్యలకును ఆకరమ్మౌ తండ్రి!
దక్షిణంపు మూర్తి దండ మయ్య!
గురవే సర్వ లోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణా మూర్తయే నమః


Comments

Popular posts from this blog

Dakshinamurty stotram English verse translation