రుద్రమ కలాపము Rudrama kalapamu

రుద్రమ కలాపము
ప్రవేశ దరువు:
పల్లవి: కాళికా మూర్తిని కాకతీ రుద్రమను
        ఆంధ్రమాతల నుదుటి అరుణ కాంతిని నేను
చరణం1 : అమ్మలందరి లోని అరిభయంకరశక్తి
            అవతార మెత్తె నన అరుదెంచితిని నేను
            గణపతిదేవుని గారాల పట్టిని
            గణుతి కెక్కిన వీరకాంతను నేను
చరణం 2: తెలుగన్న కలగన్న తెలుగాడ పడుచునే
             కురుచబుద్ధిగాళ్ల  గుండెల్లొ గుబులునే
             తెలుగు రాజ్యపు టంచు దిక్కులన్నిటి జేర
             కత్తిపట్టిన కాంత గాథనే
సూత్రధారుడు :
వచనం : పరాకు తల్లీ ! బహుపరాక్‌ ! మీ దాయాదులైన మురారి హరిహరాదులను యుద్ధములో జయించి వచ్చినారన్న మాట ......
అమ్మా భవానీ ............
రుద్రమ : నమో నమః  అమ్మా భవానీ ! దుర్గా!
సూత్రధారుడు :
వచనం: ఆ భవానీ కాదమ్మా . తమ అనుంగు చెలి, మాటకారి, వీరభేరి, పట్టిన గుట్టు కట్టు విడవని పట్టి, కులుకుల కొలికి--- భవాని !
భవాని ప్రవేశం :
పల్లవి : విజయోస్తు శ్రీ రుద్రమా దిగ్విజయోస్తు శ్రీ రుద్రమా
          జనమానసానందనందినీ విజయోస్తు శ్రీ రుద్రమా
చరణం  : మాతృమూర్తివై జనులను గాచిన
               మహితత్రాణ పరాయణకీర్తీ
                 రుద్రదేవ భద్రాంగనాకృతీ
             రుద్ధ వైరిజన  భంజనస్ప్ఫూర్తి 
మాతృమూర్తివై జనులను గాచిన  మహితత్రాణ పరాయణకీర్తీ
 రుద్రదేవ భద్రాంగనాకృతీ  రుద్ధ వైరిజన  భంజనస్ప్ఫూర్తి   // విజయోస్తు//
రుద్రమ :
వచనం : ఆహా ! ఏమి భవానీ ఏమా చిందులు ? ఏమా సంబరం ? ఈ చిందు లేమిటి తల్లీ? 
భవాని: ఔనమ్మా!  ఎన్ని కళ్లు పడ్డాయో ,ఎంత కుళ్లు తగిలిందో ! ఎంత చేస్తే దిగుతుందమా ఈ దిష్టి!?!
రుద్రమ: చాలు చాలులే రాజ కార్యాల్లో ఇవన్నీ నిత్యకృత్యాలేగా!
భవాని: ఈ రాజ కార్యాలూ నిత్యకృత్యాలూ వనితల పనులా రాణెమ్మా?
కందము :
పూజల నిన్నటి వేళల
రాజిల్లగ జూచినాము రమణుల రవణుల్
ఆజిని శత్రుల కూల్చగ
జేజేలను రేగు వీరసింహిగ నేటన్
వచనం :
నిన్నటి నోముల్లోని ఆ యాడతనమూ ఆ లాలిత్యమూ కలికితనమూ నేటి పోరుల్లోని ఆ కర్కశ కరాళ కేళీ ఆ పౌరుషమూ ఆ గరువతనమూ ఎంత చిత్రమైనదమ్మా తమ జీవనం ? 
రుద్రమ:
ఔను భవానీ ! ఈ వజ్ర కఠిన బాహ్య మూర్తి లోని కోమల విలాస విలాపాలు లోకంలో ఎంద రెరుగుదురే?
పల్లవి: కదలించకే తల్లి! కదలు డొంకలు లోన .
         కలికిరో ఎవ్వారు కాంచగలరు నేడు
         మగతనముల నాదు మగువతన మున్నదో
         మగువతనముల నాదు మగతనమున్నదో
చరణం 1 : పసిప్రాయమున తండ్రి బాలునిగ బెంచ
            సిగ్గులా మొగ్గలానూ చిదిమి వేయగ వలసె
 కలికిరో ఎవ్వారు కాంచగలరు నేడు కదిలించకే.......  //కదిలించకే//
చరణం 2 : పరువామప్పుడు మనసు పరవళ్లు తొక్కగా
             కరవాలముల తోనె కబురులాడగ వలసె
 కలికిరో ఎవ్వారు కాంచగలరు నేడు కదిలించకే.......   //కదిలించకే//
చరణం 3 : మగనీ ముద్దూ ముచ్చట మరుగంగ దీరెనా ?          
             రాత్రి పగలూ లేని రాజ్య వార్తల దేల
కలికిరో ఎవ్వారు కాంచగలరు నేడు కదిలించకే.......    //కదిలించకే//
చరణం 4 : పసిడి నా పాపలకై పాలిండ్లు పొంగార
             కవచ ధారిగ నేను కత్తి కట్టగ వలసె
కలికిరో ఎవ్వారు కాంచగలరు నేడు కదిలించకే.......    //కదిలించకే//
భవాని : ఔనమ్మా నీనెరుగనా? తమ పెద్దకుమార్తె రుయ్యమ్మ గారూ, రెండవ బిడ్డ రుద్రమ్మ గారూ, మూడవ సంతానం.. పండంటి మగబిడ్డను మీ కీయబోతున్న ముమ్మిడమ్మగారూ , నాలుగవ కుమార్తె అయిన నారమ్మ గారూ, అందరి సీమంతాలూ పురుళ్లూ అన్నీ చూసిన దాన్ని . అందుకేనమ్మా అనిపిస్తుంది తమకేం మిగిలిందని.
రుద్రమ: అతివ అటులాడకూ ఆంధ్రులము మనమూ
          ఇగురు బోణిని జగము నేలేటి జననిగా
          కాంచువారలమూ కొలుచు వారలమూ
          అమ్మ వారులకేమి ఆశలే అమ్మా?
భవానీ : అదికాదె మాయమ్మ ఆనాడు తమరూ
         మీ మామ జాయప్ప మెళకువలు జదివీ
         నృత్తరత్నములన్ని నేర్వనేమాయే ?
         కదన కురంగమ్ము కదను తొక్కించుటా?
రుద్రమ: ఆ కదనమే కదే  ఆ మామ కోరినటు
          దేశిని దేశమున దశ దిశల నిలిపె
          బైండ్ల కొగ్గుల కన్ని వంతనల వారికి
          కడగండ్లు లేకుండ కలిగించె బ్రతుకూ
భవాని : అదికాదె మా యమ్మ ఆ వేళ తమరూ
          అక్క మహాదేవి అవతార మనుచును 
          శివగురులు పొగడగా శివ శాస్త్రములు నేర్వ
          శూలమ్ములను తలలు కూలగొట్టుటకా ?
రుద్రమ : ఆ శూలమే కదే ఆ గురుల నేడు
           గోళకీ మఠములా గొడుగు నీడలను
           ఆ బాలగోపాల మాలనా పాలనలు
        అమ్మ ఒడిగా జూడ నిమ్మహిని నిలిపె
భవాని : ఔను గానీ యమ్మ అంతటికి తమరూ
          అతివ లందరు కోరు అచ్చటలు ముచ్చటలు
          గంగ పాల్జేయుచూ గడపగా వలసె
          కలసి యుందును గాన చెలిమితో వగతు
రుద్రమ: వగవ నేటికె చెలియ వరరాజ పుత్రినే
          రైతు రౌతుల శిల్పి నేత గీతల వారల
          పండితుల పామరుల వరుసలన్నిటి వార
          సాక గల్గుట నాకు జన్మ జన్మల ఫలము
భవాని : ఔనమ్మా ! తమ పుణ్యమా అనే కదా! మా బోటి మగువలము కూడా వీర విద్యలు నేర్చి విర్ర వీగుతున్నాము . నాలుగు కడళ్ల కడల దాకా తెలుగాడ పడుచును కన్నెత్తి చూడ నొడలు హడలెత్తేంత స్థానాన్ని కల్పించింది తమరే కదమ్మా !
నిష్క్రామ దరువు :
అచ్చ తెలుగు రాజ్య పరిధి నంబుధి కావల గాచి
గీత దాటి గుండెలవియ గెలిచి తరుల తరుణి నీవు  విజయీ భవ ! దిగ్విజయీ భవ!!
దుర్గములను దుర్గమముగ కట్టి గట్టి పరచినావు
ముందు నిలిచి మొగిని నడపు ముద్దు గుమ్మ వమ్మ నీవు విజయీ భవ ! దిగ్విజయీ భవ!!
సూత్రధారుడు :
విజయీ భవ!  దిగ్విజయీభవ!! అని ప్రజారాజి నజాత శత్రువుగానిజాప్త సంతానంగా పాలిస్తున్నటువంటి రుద్రమదేవి రాజ్యసరిహద్దులు సద్దు మణిగాయని కొంత సంతోషంగాఉన్న తరుణంలోనే దేవగిరి యాదవరాజైన  మహాదేవరాజు మగతనపు మదముతో మత్తిల్లి యుద్ధ సన్నద్ధుడై వచ్చి ఎదురు నిలువ భద్రకాళియై రుద్రమ అతని నెదుర్కొనిన విధం బెట్టిదనిన.........
(ఇంకా ఉంది)
   

        
 
        

Comments

Popular posts from this blog

దక్షిణామూర్తి స్తోత్రము - తెలుగు అనువాదము

Dakshinamurty stotram English verse translation