Baala Sarasvati Telugu verses
తెల్ల దనమంత చల్లని తల్లి గాగ బుజ్జి బంగారు తల్లి కబుర్ల పుట్ట తెలుపు లొలికెడి పూవుపొత్తిళ్ల మీద చదువు పుట్టంగ పుట్టె మా శారదమ్మ నిదురలో నవ్వి పాట వెన్నెలలు చిలికి చిట్టి గుప్పిళ్లఁ పాటల గుట్టు దాచి పాట మాటల పరుపుపై పాకిపాకి పాడ నొడిజేరఁ బుట్టె మా వాణి తల్లి నెత్తి పైకెక్కి ఎదదిగి మెత్తఁ దన్ని కదలి గురిచూచి పైపైకి గాలి నూది చిలిపిగా నాల్క నాడించి చెవులఁ గొట్టి రవ్వఁజేయ బుట్టెను మా సరస్వతమ్మ చిక్క దొకపట్టు నెవరికి జక్కనమ్మ చిక్కి నంతకె పులకలఁ జిలుకఁ జేయు నాట పాటల గుట్లన్ని యంది పుచ్చి పంచి యాడంగఁ బుట్టె మా భారతమ్మ మాకు నీవిచ్చు నుడుల మాం మమ్ము పెట్టి పాల నీ పల్కుచిన్కులన్ లాల పోసి చేరి ని న్నెత్తుకొన నిమ్ము చేతు లిచ్చి రక్ష! రక్షమ్మ! బాల సరస్వతమ్మ